తెలంగాణవీణ సినిమా : సినీనటి హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిర్ణయం తీసుకుంది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది.గత కొన్ని రోజుల కిందట బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు. హేమను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి మీడియాకు ముందుకు వచ్చిన హేమ.. మీడియాలో వస్తున్న నిరాధారమైన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, తనని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు.తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నట్లు నివేదికలు సమర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘మా’ అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖతో పాటు, మెడికల్ సర్టిఫికెట్‌లను పంపారు. హేమ పంపిన ఆధారాలను పరిశీలించిన ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి, ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.