తెలంగాణవీణ జాతీయం : తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కుమార్తెలకు తనపై ద్వేషం నూరిపోశారని విమర్శించారు. కుటుంబ వివాదం రోడ్డెక్కిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ప్రతి కుటుంబంలోనూ గొడవలు వస్తాయి. వాటిని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి. రాజకీయ, వ్యాపారరంగాల్లోనూ తానే ఉండాలనే అహంకారం వాణీది. నా కుమార్తెలకు ద్వేషం నూరిపోసింది. నాపైనే ఈర్ష్యా ద్వేషాలు రగిల్చి పిల్లలు నన్నే ప్రశ్నించేలా చేసింది. తండ్రిని ప్రశ్నించమని పిల్లలను తల్లి ప్రేరేపించడమా? నా వ్యాపారం, రాజకీయాల్లో పరిస్థితులు బాగున్నప్పుడే అందులో ఆమెకు ఆధిపత్యం కావాలి. మూలపేట పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ నాకు టెక్కలి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు. ఆ తర్వాత టికెట్ కావాలని అధిష్ఠానం వద్దకు వాణి వెళ్లింది. నాలుగు దఫాలుగా దీనిపై చర్చలు జరిగాయి. టికెట్ ప్రకటించాలని.. నాతో విడాకులు కావాలని పట్టుబట్టింది. లేదంటే విషం తాగుతానని బెదిరించింది. రచ్చకెక్కిన దువ్వాడ ఇంటి గుట్టు.. అర్ధరాత్రి ఉద్రిక్తత కుటుంబం కోసం జగన్‌కు నచ్చజెప్పి నా టికెట్‌ను వాణికి ప్రకటించాను. నాకే స్వార్థం ఉంటే ఆమెకు టికెట్ ప్రకటిస్తానా? క్షేత్రస్థాయిలో పరిస్థితి వాణీకి అనుకూలంగా లేదని తేలడంతో మళ్లీ నాకు టికెట్ ఇచ్చారు. ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చా. గ్రానైట్ వ్యాపారంలో ఎంత డబ్బు వస్తే అంత వాణి చేతిలో పెట్టా. ఏనాడూ లెక్క కూడా అడగలేదు. టికెట్ ప్రకటించిన మూడోరోజు నుంచి నన్ను ఇంటికి రానివ్వలేదు.. తాళాలు వేసింది. పాతికేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో అవహేళనలు, అవమానాలు పడ్డాను. నా తల్లిని అనరాని మాటలతో వాణి వేధించింది. నా టికెట్, నా సంపాదన వదులుకున్నాను.. నేనేం తప్పు చేశానని నాకీ శిక్ష? నాకెందుకీ హింస?’’ అని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు.