తెలంగాణవీణ క్రీడలు :ఐపీఎల్ 2025 సీజన్‌లో ఎంఎస్ ధోనీ ఆడతాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వచ్చే ఎడిషన్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవకాశం ఉండదనే వార్తలు వస్తున్నాయి. గత సీజన్‌లో లోయర్ ఆర్డర్ కంటే దిగువన ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆఖరి ఓవర్లలో దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు. కెప్టెన్సీ కూడా వదిలేసిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే సీజన్‌లో ఇంపాక్ట్ బరిలోకి దిగుతాడని అంతా ఊహించారు. ఇప్పుడు ఆ రూల్‌నే పక్కన పెట్టేసే అవకాశం ఉందనే కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధోనీని (MS Dhoni) అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా తీసుకొనేందుకు సీఎస్‌కే మొగ్గు చూపిస్తోందని సమాచారం. సాధారణంగా క్రికెట్ పరిభాషలో.. అన్‌క్యాప్‌డ్ అంటే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని క్రికెటర్ అని అర్థం. దేశవాళీలో ఆడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇంకా అడుగుపెట్టని వారిని అలా పిలుస్తుంటారు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్లనూ ఇలానే వ్యవహరిస్తుంటారు. సదరు ప్లేయర్‌ను అన్‌క్యాప్‌డ్‌గా భావించే ఆస్కారముంది. ధోనీ విషయంలో దీనిని అమల్లోకి తీసుకురావాలనేది సీఎస్‌కే విజ్ఞప్తి. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ 2020లో వీడ్కోలు పలికాడు. గత నెలాఖరున జరిగిన సమావేశంలో బీసీసీఐ దృష్టికి ఈ రిటెన్షన్ రూల్‌ను సీఎస్‌కే తీసుకెళ్లింది. బోర్డు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ రూల్ వస్తే నిధులపరంగానూ చెన్నైకి ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం ధోనీ రూ.12 కోట్లు వరకు తీసుకుంటున్నాడు. ఒకవేళ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగితే అతడికి రూ.4 కోట్లకు మించి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మిగతా సొమ్మును పెద్ద ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు వినియోగించుకోవచ్చు.వచ్చే ఏడాది ఐపీఎల్ భవితవ్యంపై ధోనీ గతంలో ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ప్లేయర్ రిటెన్షన్ రూల్‌పై ఎలాంటి నిర్ణయం వస్తుందో చూద్దాం. ఇప్పుడు బంతి మన కోర్టులో లేదు. ఒక్కసారి నియమనిబంధనలు ఖరారైతే.. అప్పుడు నిర్ణయం తీసుకుంటా. ఏదైనా సరే జట్టు ప్రయోజనానికే మొదటి ప్రాధాన్యం’’ అని ధోనీ వెల్లడించాడు.