తెలంగాణవీణ సినిమా : చిత్రం: డిమోంటి కాలనీ2; నటీనటులు:అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్, అర్చనా రామచంద్రన్ తదితరులు; దర్శకత్వం: ఆర్.అజయ్ జ్ఞానముత్తు; విడుదల: 23-08-2024విభిన్నమైన హారర్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ‘డిమోంటి కాలనీ’కి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘డిమోంటి కాలనీ 2’. ఇప్పటికే తమిళంలో విడుదలైన మంచి టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ ఎలా ఉంది?తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా?కథేంటంటే: క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది డెబీ (ప్రియ భవానీ శంకర్). అతన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ, అంతలోనే సామ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీంతో డెబీ తన భర్త ఆత్మహత్య వెనకున్న కారణమేంటన్నది అర్థం కాక మానసికంగా చాలా సతమతమవుతుంది. ఓ బౌద్ధ సన్యాసి (త్సెరింగ్ దోర్జీ) సాయంతో తన భర్త ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సామ్ చదివిన ఓ పుస్తకమే అతని చావుకు కారణమని ఈ తరహాలోనే పలువురు మృత్యువాతపడ్డారని తెలుసుకుంటుంది. అలాగే అప్పటికే ఆ పుస్తకం చదివిన కవల సోదరులు శ్రీనివాస్ – రఘునందన్ (అరుళ్ నిధి)ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తిస్తుంది. దీంతో ఈ వరుస చావులకు చెక్ పెట్టేందుకు ప్రియ తన మామ రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో పాటు శ్రీనివాస్ సోదరుడు రఘునందన్‌తో కలిసి ఓ ప్రణాళిక రచిస్తుంది. మరి ప్రియ ప్రణాళిక ఫలించిందా? రఘునందన్‌ను అతని సోదరుడ్ని ప్రాణాలతో రక్షించిందా? అసలు డిమోంటి కాలనీకి ఈ పుస్తకానికి ఉన్న లింకేంటి? అన్నది మిగతా కథ.ఎలా సాగిందంటే: టైటిల్ కార్డ్స్‌తోనే ‘డిమోంటి కాలనీ’ కథను క్లుప్తంగా పరిచయం చేసి.. ఈ రెండో భాగం కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. అక్కడి నుంచి కథను మూడు చాప్టర్లుగా విడగొట్టి ప్రేక్షకులకు ఒక్కొక్కటీ పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. తొలి చాప్టర్‌లో డెబీ భర్త ఆత్మహత్య చేసుకోవడం, బౌద్ధ సన్యాసుల సాయంతో భర్త ఆత్మతో ఆమె మాట్లాడే ప్రయత్నం చేయడం వంటి సన్నివేలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఇక రెండో చాప్టర్‌లో కవల సోదరులు శ్రీనివాస్ – రఘునందన్‌ల చుట్టూ తిరుగుతుంది. ప్రియ కథతో ఈ కవల సోదరుల కథను ముడిపెట్టిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. శ్రీనివాస్ మరణంతో రఘునందన్ చావు ముడిపడి ఉన్నట్లు తెలిసినప్పటి నుంచి కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఇక్కడి నుంచి డెబీ, రఘునందన్‌ల ప్రయాణంతో మూడో చాప్టర్‌ను ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా తీర్చిదిద్దారు.ద్వితీయార్ధం డిమోంటి కాలనీ కోణం నుంచి ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. ఎక్కడో హాస్టల్‌లో ఉన్న ముగ్గురు ఆడపిల్లలు ఓ పుస్తకం చదివి డిమోంటి హౌస్‌లో ప్రత్యక్షమవడం.. అక్కడ వారికెదురయ్యే భయానక అనుభవాలు చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అయితే ఇక్కడ నుంచి దర్శకుడి స్క్రీన్‌ప్లే ప్రేక్షకుల్ని కాస్త గందరగోళానికి గురి చేస్తుంది. ముగింపు వరకు ఈ గందరగోళం అలాగే కొనసాగుతుంది. పతాక సన్నివేశాలు ఉత్కంఠరేకెత్తించేలా ఉండటంతో పాటు, మూడో భాగానికి లీడ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఎవరెలా చేశారంటే: కవల సోదరులుగా శ్రీనివాస్, రఘునందన్ పాత్రల్లో అరుళ్ నిధి చక్కటి వేరియేషన్ చూపించాడు. ద్వితీయార్ధంలో ఆయన పాత్రలు రెండూ ప్రేక్షకుల్ని భయపెడతాయి. డెబీ పాత్రలో ప్రియ భవానీ శంకర్ ఆద్యంతం సీరియస్ మూడ్‌లోనే కనిపించింది. సెకండాఫ్‌లో ఆమె నటన అందర్నీ కట్టిపడేస్తుంది. బౌద్ధ సన్యాసుల పాత్రలన్నీ థ్రిల్ పంచేలా ఉంటాయి. అరుణ్ పాండ్యన్‌తో పాటు మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి. ఈ కథను ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడపడంలో దర్శకుడు పైచేయి సాధించాడు. అయితే ద్వితీయార్ధాన్ని మరీ ట్రిక్కీ స్క్రీన్‌ప్లేతో కంగాళిగా మార్చినట్లు అనిపిస్తుంది. సాంకేతిక బృందం పనితీరు బాగుంది.
బలాలు
- ప్రియ, అరుళ్ నిధి నటన
- కథలోని మలుపులు.. హారర్ అంశాలు
- విరామ సన్నివేశాలు
బలహీనతలు - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
- ముగింపు
చివరిగా: ‘డిమోంటి కాలనీ 2’.. హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి మాత్రమే! (Demonte Colony 2 Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!