తెలంగాణవీణ జాతీయం : పది రూపాయల నాణేనికి పెద్ద కష్టం వచ్చింది..! ఎందుకు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదుగానీ పది రూపాయల నాణెం చెల్లదన్న అపోహ ప్రజల్లో ప్రబలింది. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్నేళ్లుగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) విశ్వప్రయత్నం చేస్తోంది. ఏ డిజైన్, ఏ ఆకృతిలో ఉన్న పది రూపాయల నాణెమైనా చెల్లుతుందని, వాటిని తీసుకోవడానికి నిరాకరించవద్దని ఆర్‌బీఐ స్పష్టం చేస్తోంది. అలాచేస్తే చట్టప్రకారం శిక్షార్హులని కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది.
పాతుకుపోయిన అపోహలు సాధారణంగా కూరగాయల వ్యాపారులు, కిరాణా, బడ్డీ కొట్లు, చిన్నచిన్న హోటళ్ల వర్తకులు చిల్లర నాణేల కొరతతో ఇబ్బంది పడుతుంటారు. వారు కూడా పది రూపాయల నాణెం ఇస్తే మాత్రం తీసుకోబోమని చెప్పేస్తున్నారు.
బాగా నలిగిన పది రూపాయల నోటు అయినా తీసుకుంటున్నారు తప్ప పది నాణేలకు మాత్రం ససేమిరా అంటున్నారు.
బడా మాల్స్ సిబ్బందిలోనూ పది నాణేలపై అపోహ ఉంది. దీంతో ఎక్కడికక్కడ వివిధ బ్యాంకుల చెస్ట్‌ల్లో ఈ నాణేలు లక్షల్లో పేరుకుపోతున్నాయి. విజయవాడలోని ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెస్ట్‌లోనే పది రూపాయల నాణేలు 12 లక్షలు పేరుకుపోయినట్టు సమాచారం. వాటిని పెట్టేందుకు చోటులేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పది రూపాయల నాణేలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్‌బీఐ బుధవారం విజయవాడలో ప్రధాన బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటెయిల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహిస్తోంది. పలు డిజైన్లలో పది నాణేలు 2009 మార్చి – 2017 జూన్ మధ్య 14 సందర్భాల్లో పది రూపాయల నాణేలు విడుదలయ్యాయి. సందర్భాల్ని బట్టి అవి పలు డిజైన్‌లతో ఉన్నాయి.సాధారణంగా రూ.పది నోట్ల మార్పిడి ఎక్కువ. చేతులు మారే కొద్దీ అవి త్వరగా పాడవుతుంటాయి. దీన్ని అధిగమించేందుకు ఆర్‌బీఐ.. మిగతా నాణేలతోపాటు కొన్నేళ్లుగా రూ.పది నాణేలనూ ముద్రిస్తోంది.‘బ్యాంకులకు వచ్చే పాడైపోయిన నోట్లను చెస్ట్‌లలో జమ చేస్తుంటాం. అక్కడినుంచి అవి ఆర్‌బీఐకి వెళుతుంటాయి. ప్రజల్లో అపోహల వల్ల చిరిగిన నోట్లతో పాటు రూ.పది నాణేలనూ మేం బ్యాంకు చెస్ట్‌లో జమ చేయాల్సి వస్తోంది’ అని విజయవాడలోని ఒక బ్యాంకు మేనేజర్ తెలిపారు.