తెలంగాణవీణ సినిమా : ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి విలువైన కానుక అందజేశారు. ‘ఇంద్ర’ రీ రిలీజ్ ను పురస్కరించుకుని ఆ చిత్రబృందాన్ని శుక్రవారం చిరు కలిశారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు బి.గోపాల్, సంగీత దర్శకుడు మణిశర్మ, సినీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, చిన్నికృష్ణలను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. ఆ సినిమా విశేషాలను నెమరువేసుకున్నారు.ఇందులో భాగంగా అశ్వనీదత్‌కు ఒక అందమైన శంఖాన్ని బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అశ్వనీదత్ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘ఈ విజయశంఖాన్ని కానుకగా మీరు ఇచ్చారు. కానీ, ఇంద్రుడై, దేవేంద్రుడై దానిని పూరించింది మాత్రం ముమ్మాటికీ మీరే. ఈ కానుక అమూల్యం. ఈ జ్ఞాపకం అపురూపం. అదెప్పటికీ నా గుండెల్లో పదిలం’’ అని పేర్కొన్నారు. ‘ఇంద్ర’ టీమ్‌ను కలవడంపై చిరు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ఇంద్ర’ క్రియేట్ చేసిన సునామీ గుర్తుచేస్తూ 22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్లలో రిలీజైన సందర్భంగా చిరు సత్కారం. సినిమా మేకింగ్ విశేషాలను నెమరు వేసుకోవడం జరిగింది’’ అని తెలిపారు.‘‘ఇంద్ర’ సినిమా నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కాలం మారిపోతుంది. తరాలు మారిపోతాయి. ఒక్కరు మాత్రమే కాలానికి ఎదురీది.. తరాలను దాటి.. శాశ్వతంగా నిలిచి పోరాటం చేస్తారు. అలాంటి వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిర్మించడం నా అదృష్టం. థాంక్యూ చిరు. త్వరలో మీతో ఐదో చిత్రం కూడా నిర్మిస్తా అని మాటిస్తున్నా’’ అని ఇటీవల ‘ఇంద్ర’ రీ రిలీజ్‌ను ఉద్దేశించి అశ్వనీదత్ పేర్కొన్నారు.చిరంజీవి – అశ్వనీదత్ కాంబినేషన్‌లో ఇప్పటివరకూ నాలుగు చిత్రాలు తెరకెక్కాయి. ఈ కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీగా గుర్తింపు సొంతం చేసుకుంది. చిరు హీరోగా నటించిన ‘చూడాలని వుంది’, ‘ఇంద్ర’, ‘జై చిరంజీవ’లను అశ్వనీదత్ నిర్మించారు.