తెలంగాణవీణ ఏపీ బ్యూరో : ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 96శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. ఒక్క రోజులోనే పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. సత్యసాయి జిల్లా మండకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛను డబ్బులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 4గంటల సమయానికి 96శాతం పింఛన్లు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. మిగిలిన నాలుగుశాతం పెన్షన్లు పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ జరిగింది.