తెలంగాణవీణ ఏపీ బ్యూరో : తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైకాపా విష ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైకాపా మూకలేనని మండిపడ్డారు. ‘‘విష ప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసింది. సింక్‌లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. చేతులు కడిగే స్థలంలో వైకాపా మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారు. అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నారు’’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు. తణుకు అన్న క్యాంటీన్‌లో శుభ్రత పాటించడం లేదన్న ప్రచారంపై ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ ఆరా తీశారు. హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారులు నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్లేట్లను మురికినీటిలో కడుతున్నారనేది పూర్తిగా అవాస్తవమని అధికారులు మంత్రికి తెలిపారు. వాష్ బేసిన్‌లోని ప్లేట్లు తీస్తుంటే వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎక్కువమంది రావడంతో డస్ట్ బిన్‌కు బదులుగా వాష్ బేసిన్‌లో పెట్టారని అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వాస్తవం కాదని స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.