తెలంగాణవీణ సినిమా : రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగాతెరకెక్కించిన చిత్రం ‘యానిమల్’ . యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో చూపించిన పలు అంశాలపై సినీ ప్రముఖుల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, ఈ సినిమా తనకెంతో నచ్చిందని బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ అన్నారు. హిందీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఈ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నానని చెప్పారు.‘‘విమర్శలను పక్కనపెడితే నాకు ఆ సినిమా బాగా నచ్చింది. ఆ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఉంది. ఆ సినిమాకు అంతటి వ్యతిరేకత రావడానికి గల కారణాలు అర్థం చేసుకోగలను. కానీ, నేను ఏ చిత్రాన్నైనా ప్రేక్షకుల దృష్టి కోణం నుంచి చూస్తా. కచ్చితంగా కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయి. అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగా వర్క్, మేకింగ్ స్టైల్ మెచ్చుకోవాల్సి ఉంది. కథ పరంగా ఆయన క్రియేటివ్ రిస్కులు తీసుకున్నారు. అందుకు ఆయన్ని ప్రశంసించాలి. అలాంటి రిస్కులు తీసుకోవడం వల్లే ఆయన తెరకెక్కించిన మిగిలిన చిత్రాలతో పోలిస్తే ఇది చాలా విభిన్నంగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. ‘యానిమల్’ చిత్రం గురించి ఇమ్రాన్ గతంలోనూ మాట్లాడారు. రణ్‌బీర్ అద్భుతంగా యాక్ట్ చేశారన్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రేక్షకులను అలరించేలా ఆయన నటించారన్నారు.తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘యానిమల్’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లోనూ వ్యూస్ విషయంలో టాప్‌లో నిలిచింది. రణ్‌బీర్‌తోపాటు రష్మిక, త్రిప్తి దిమ్రి, అనిల్ కపూర్, బాబీ దేవోల్, పృథ్వీరాజ్ తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇందులో తీవ్ర హింసను ప్రోత్సహించడం, స్త్రీని తక్కువ చేసి చూపించడం ఏం బాలేదంటూ గతంలో పలువురు బాలీవుడ్ దర్శక – నిర్మాతలు, రచయితలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘యానిమల్ ది పార్క్’ రానుంది. 2025లో ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం ‘ఓజీ’లో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.