తెలంగాణవీణ జాతీయం : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవల చోటుచేసుకున్న హత్యాయత్నం ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. దానిని తన సతీమణి మెలానియా లైవ్‌లో చూశారని ట్రంప్ వెల్లడించారు. ఆ ఘటన తర్వాత కూడా తాను బహిరంగ ర్యాలీల విషయంలో వెనకడుగు వేయనని స్పష్టంచేశారు.‘‘ఆ రోజు ఎన్నికల ప్రచారాన్ని మెలానియా టీవీలో చూస్తోంది. కాల్పులు జరగడంతో నేను కింద పడిపోయాను. నా ఒంటికి ఉన్న రక్తాన్ని చూసి ఏదో జరగరానిది జరిగిందని ఆందోళనకు గురైంది. ఆ ఘటన గురించి ఆమె మాట్లాడలేకపోయింది. నా గురించి ఆమె పడిన భయమే అందుకు కారణం. ఆమె నన్ను ప్రేమిస్తోందని దానర్థం’’ అని ట్రంప్ వెల్లడించారు.ఇదిలాఉంటే.. కాల్పుల సమయంలో అక్కడే ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు స్పందించిన తీరు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్రంప్ తల బయటకు కన్పించడంతో భద్రత కల్పించిన మహిళా అధికారిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా మాజీ అధ్యక్షుడు స్పందిస్తూ.. ఆ మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు అండగా నిలిచారు. ఆమె తప్పేం లేదని, తనకు భద్రత కల్పించేందుకు ఆమె శాయశక్తులా ప్రయత్నించారని ప్రశంసించిన సంగతి తెలిసిందే.ఇటీవల పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతుండగా ఓ యువకుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఓ తూటా ట్రంప్ చెవి పైభాగం నుంచి దూసుకెళ్లడంతో ఆయన గాయపడ్డారు. దాడి నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. ట్రంప్‌ను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలిచారు. వెంటనే దుండగుడిని హతమార్చారు.