తెలంగాణవీణ ఏపీ బ్యూరో : వైకాపా అధ్యక్షుడు జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని చెబితే.. ఆయనకు కొమ్ముకాసినట్లుందా?అని ప్రశ్నించారు. జగన్ అద్దంలో చూసుకుంటే ఇప్పుడు కూడా ఆయనకు చంద్రబాబే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా జగన్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో నన్ను కించపరిచేంత ద్వేషం ఉంది. మాకు అలాంటి ద్వేషం లేదుగానీ, తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు. కాబట్టే.. తప్పు అని కచ్చితంగా చెప్పాం. చట్ట సభను గౌరవించకపోవడం తప్పు. అందుకే రాజీనామా చేయాలన్నాం.వైఎస్‌ఆర్ విగ్రహాలను కూల్చేస్తే.. స్వయంగా అక్కడికి వెళ్లి, ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చకుండా ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే.. ఈరోజు వైఎస్‌ఆర్‌కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. వైకాపాలో వైఎస్‌ఆర్‌ని, విజయమ్మను అవమానించిన వాళ్లే పెద్దవాళ్లు కదా. అసెంబ్లీలో పోరాడటం మీకు చేతకాదు. మీకు మీడియా పాయింటే ఎక్కువ.తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిలువునా మోసం చేయడం నిజం కాదా? రూ.3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. రూ.4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు. వైఎస్‌ఆర్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం.. భాజపాతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను భాజపాకు తాకట్టుపెట్టారు. మీ అహంకారమే మీ పతనానికి కారణం’’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.