తెలంగాణవీణ రాజకీయం : కొందరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయలేదా? అని ప్రశ్నించారు. ‘‘గతంలో కొన్ని సంప్రదాయాలు నెలకొల్పారు. నన్ను ఏ రోజూ అసెంబ్లీలో కూర్చోనివ్వలేదు. నా దగ్గరకు 10మంది భారాస ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ శాసనసభ గురువారానికి వాయిదా పడిన తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ‘‘సబితా ఇంద్రారెడ్డి మోసం అనే పదానికి భట్టి విక్రమార్క స్పష్టంగా సభలో చెప్పారు. సునితా లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రచారానికి వెళ్తే నాపై రెండు కేసులు పెట్టారు. భారాసలోకి వెళ్లిన సునీతా లక్ష్మారెడ్డి నాపై ఉన్న కేసులు కూడా తీయించలేదు. నేను సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదు. ఆమెను సొంత అక్కలా భావించా. నన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి.. ఆమె భారాసలోకి వెళ్లారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ తీసుకో నేను పనిచేస్తా అని చెప్పి.. టికెట్ రాగానే సబిత భారాసలోకి వెళ్లారు. జగదీశ్‌రెడ్డి గంటా 10 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలు మొత్తం 6గంటలు మాట్లాడారు. సబితకు మాట్లాడే అవకాశం ఇచ్చాం. ఆమె వ్యక్తిగత ప్రస్తావన తెస్తే.. మిగిలినది నేను చెప్పా. కేసీఆర్, హరీశ్‌రావు సభకు ఎందుకు డుమ్మా కొట్టారు. సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీశ్‌రావు అండగా నిలవాలి. సభలో గందరగోళం చేసేందుకే కేటీఆర్ సభకు వస్తున్నారు.మేం సరిపోతం అంటే ఫ్లోర్ లీడర్‌గా కేసీఆర్ ఎందుకు? కేటీఆర్ ఉండొచ్చు కదా. బాధ్యత లేని వ్యక్తి కేసీఆర్. అధికారం లేపోతే ప్రజలు అవసరం లేదన్నట్టు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా బడ్జెట్‌పై ఇంత చర్చ జరగలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నడుస్తోంది. ఒక్క రోజు 17 గంటల పాటు సభ జరిగింది. కేంద్ర బడ్జెట్‌కు అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టాం. ఈ రోజు మొత్తం బడ్జెట్‌కు ఆమోదం తెలిపాం’’ అని సీఎం వివరించారు.