తెలంగాణవీణ హెదరాబాద్ : తొలివిడతగా రూ.1 లక్ష లోపు రైతు రుణాల మాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది.
ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ నెలాఖరు నాటికి రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. మూడు దశల్లో రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడత రుణమాఫీకి రూ.8వేల కోట్లు అవసరమని అంచనా. రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు ఉన్న రైతు రుణాలను ఆగస్టు 15లోపు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడో విడత రుణమాఫీకి రూ. 15వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.