తెలంగాణవీణ సినిమా : ‘యానిమల్’ విడుదలై చాలా రోజులైనప్పటికీ సినీ ప్రముఖులు ఇంకా విమర్శలు చేస్తున్నారు. తీవ్ర హింస, పలు సన్నివేశాల్లో స్త్రీని తక్కువగా చూపించడం ఏం బాలేదని ఇటీవల జావేద్ అక్తర్ మరోసారి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తన చిత్రానికి వస్తోన్న నెగెటివిటీపై రణ్‌బీర్ కపూర్ తొలిసారి స్పందించారు. ఇది విడుదలయ్యాక.. తాను ఇలాంటి చిత్రంలో నటించడం తమకు ఏమాత్రం నచ్చలేదని పలువురు సినీ ప్రముఖులు చెప్పారన్నారు.
‘‘ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కాకపోతే అది తప్పుగా అర్థమైంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీని ఎక్కువగా వ్యాప్తి చేస్తుంది. కొంతమంది వ్యక్తులు మాట్లాడుకోవడానికి ఏదో ఒక అంశం కావాలి. అందుకే వాళ్లు ఇదొక స్త్రీ ద్వేషపూరిత చిత్రమని కామెంట్స్ చేశారు. అది నిజం కాదు. అయినప్పటికీ ప్రజల్లోకి ఆ భావన వెళ్లిపోయింది. ఇది విడుదలయ్యాక చాలామందిని కలిశా. ‘‘ ఇందులో నటించకుండా ఉండాల్సింది. నువ్వు యాక్ట్ చేయడం మమ్మల్ని బాధించింది’’ అని చెప్పారు. అలా చెప్పిన వారిలో చాలామంది పరిశ్రమకు చెందినవారే. ‘క్షమించాలి. మరోసారి ఇలాంటి సినిమా చేయను’ అని బదులిచ్చా . వారి అభిప్రాయాలతో ఏకీభవించను. ప్రస్తుతం గొడవలు పెట్టుకునే దశలో లేను. నా వర్క్ నచ్చలేదని చెబితే.. తదుపరి చిత్రానికి కష్టపడి వర్క్ చేస్తా అని చెబుతా’’ అని రణ్‌బీర్ తెలిపారు.‘‘ఇప్పటివరకూ రొమాంటిక్, ప్రేమకథా చిత్రాల్లో నటించా. గుడ్‌బాయ్ రోల్స్ పోషించా. ఈ కథ విన్నప్పుడు భయపడ్డా. బోల్డ్, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందనిపించింది. ప్రేక్షకులు అంగీకరిస్తారా? లేదా? అని టెన్షన్‌కు గురయ్యా. ఇది విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా.. విశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నా’’ అని తెలిపారు.‘యానిమల్’ను సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించారు. రష్మిక కథానాయిక. త్రిప్తి డిమ్రీ కీలక పాత్ర పోషించారు. తండ్రీ తనయుల సెంటిమెంట్‌తో రూపొందించారు. ఇందులో తీవ్ర హింసను ప్రోత్సహించడం ఏం బాలేదంటూ గతంలో పలువురు బాలీవుడ్ దర్శక – నిర్మాతలు, రచయితలు విమర్శలు చేశారు. ‘యానిమల్’కు సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ రానుంది.