తెలంగాణవీణ సినిమా : నటుడు రామ్‌చరణ్ ఆయన సతీమణి ఉపాసన మంచి మనసు ఉన్నవారని క్లీంకార కేర్ టేకర్ లలిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాప విషయంలో వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారని.. చక్కగా చూసుకుంటారని చెప్పారు. వారిద్దరూ మంచి పేరెంట్స్ అంటూ కితాబిచ్చారు.‘‘అంబానీ కుటుంబం మొదలుకొని ఇప్పటి వరకూ ఎంతోమంది స్టార్ కిడ్స్‌కు నానీ/ఆయాగా వర్క్ చేశా. అందరూ బాగా చూసుకున్నారు. తమ కుటుంబాల్లోకి గొప్ప మనసుతో స్వాగతించారు. ప్రస్తుతం రామ్‌చరణ్ – ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకారకు నానీగా వర్క్ చేస్తున్నా. అక్కడికి ఇక్కడికి ఉన్న ఒకే ఒక్క వ్యత్యాసం ఏమిటంటే.. ఆహార పద్ధతులు. ఎందుకంటే కొణిదెల కుటుంబం దక్షిణాదికి చెందినది కావడం. ఈ ఫ్యామిలీ చాలా మంచిది. నేను విశ్రాంతి తీసుకునేటప్పుడు పాపను ఉపాసన చూసుకుంటారు. అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్‌పర్సన్ అయినప్పటికీ ఆమె సింపుల్‌గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆమెది. బేబీని ఎత్తుకో.. జాగ్రత్తగా చూసుకో అంటూ ఫోర్స్ చేయరు. నన్ను తమ కుటుంబ సభ్యురాలిగా చూస్తారు’’ అని లలిత చెప్పారు. రామ్‌చరణ్ – ఉపాసన 2012లో వివాహం చేసుకున్నారు. గతేడాది జూన్ 20న వీరికి క్లీంకార జన్మించింది. పాప పుట్టిన తర్వాత తమ జీవితం ఎంతో మారిందని ఇటీవల ఉపాసన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఇప్పుడు నేనెంతో ఆనందంగా ఉన్నా. జీవితం విలువను తను నాకు తెలియజేసింది. తన వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా’’ అని అన్నారు.