తెలంగాణవీణ జాతీయం : కర్ణాటకలో తీసుకొచ్చిన ప్రైవేటు కోటా బిల్లును ఫోన్‌పే సీఈవో, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ (Sameer Nigam) వ్యతిరేకించారు. తల్లిదండ్రుల ఉద్యోగాల వల్ల వివిధ రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థులు దీనివల్ల నష్టపోతారన్నారు. కర్ణాటకలోని (Karnataka) సంస్థల్లో పాలన విభాగంలో 50శాతం, గ్రూప్ సీ, డీ ఉద్యోగాల్లో 70శాతం ఉద్యోగాలను స్థానిక కన్నడిగులకే కేటాయించాలంటూ అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
దీనిపై సమీర్ నిగమ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నేను స్థాపించిన సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 25వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాను. ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నాను. ఇప్పుడు నా వయస్సు 46 ఏళ్లు. ఇప్పటివరకు ఒక్క రాష్ట్రంలో కూడా 15 ఏళ్లకు మించి నివసించలేదు. అలాగని, కర్ణాటకలో పుట్టి పెరిగిన నా పిల్లలు.. ఇక్కడ ఉద్యోగం చేసేందుకు అర్హులు కాదా? మా నాన్న ఇండియన్ నేవీలో పని చేశారు. దేశవ్యాప్తంగా వివిధ చోట్ల విధులు నిర్వర్తించారు. ఆయన పిల్లలకు కర్ణాటకలో ఉద్యోగం చేసే అర్హత లేదా?’’ అని నిగమ్ ప్రశ్నించారు.
ప్రైవేటు ఉద్యోగాల్లో సింహభాగం కన్నడిగులకే దక్కాలంటూ డాక్టర్ సరోజినీ మహిషీ గతంలో సమర్పించిన నివేదికను అమలుచేయాలని సోమవారం మంత్రివర్గ సమావేశంలో పలువురు ప్రస్తావించారు. అయితే, ఐటీ కంపెనీల్లో ఈ నిబంధనలను అమలుచేస్తే, నాణ్యతా ప్రమాణాలు లోపిస్తాయని, తమ ఆదాయాన్ని కోల్పోతామని ఆ సంస్థల ప్రతినిధులు విమర్శించారు. వంద శాతం ఉద్యోగాలను కన్నడిగులకే ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం యోచించడాన్ని అన్ని ప్రైవేటు సంస్థలు ఖండించాయి. ఇలాంటి నిర్ణయమే ఇతర రాష్ట్రాలు, దేశాలు తీసుకుంటే కన్నడిగులు తిరిగి రావలసి ఉంటుందని విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలో కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు వెల్లడించింది.