తెలంగాణవీణ జాతీయం : ఒలింపిక్స్‌లో క్రికెట్ అరంగేట్రం కోసం ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నాడు టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 2028 ఒలింపిక్స్ గురించి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇప్పటినుంచే సీరియస్‌గా చర్చ నడుస్తోందని తెలిపాడు. పారిస్ ఒలింపిక్స్ 2024)కు వెళ్లిన ద్రవిడ్ అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ అంశంపై పారిస్‌లో ఆదివారం ప్యానెల్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో ద్రవిడ్ పాల్గొన్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘డ్రెస్సింగ్ రూమ్‌లో దీనిగురించి చర్చించడం విన్నా. 2026 టీ20 ప్రపంచకప్, 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్ మాదిరిగానే 2028 ఒలింపిక్స్ (2028) గురించి ఆటగాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఈ విశ్వ క్రీడల్లో తాము భాగం కావాలని, పోడియంపై నిలబడి పతకం అందుకోవాలని క్రికెటర్లు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే సన్నద్ధత మొదలుపెట్టారు’’ అని మాజీ కోచ్ తెలిపాడు.‘‘ఈ మెగా సంబరంలో క్రికెట్ టోర్నీ ప్రారంభమయ్యాక.. భారత మహిళా, పురుషుల జట్లు కచ్చితంగా స్వర్ణం గెలుస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నా. ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం ప్రస్తుతానికి నాకైతే లేదు. కానీ, ఏదోఒకరకంగా లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో భాగమయ్యేందుకు ప్రయత్నిస్తా. జట్టుతో కలిసి కుదరకపోతే కనీసం మీడియా జాబ్ అయినా చేస్తా’’ అని ద్రవిడ్ నవ్వుతూ తెలిపాడు.