తెలంగాణవీణ జాతీయం ఏపి బ్యూరో : పాఠశాల గోడ కూలి మృతి చెందిన విద్యార్థి గురుమహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. నాడు-నేడు పనుల నాణ్యతా లోపం కారణంగా 9వ తరగతి విద్యార్థి గురుమహేంద్ర 4 రోజుల క్రితం మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న నెల్లూరు నగరం భక్తవత్సల నగర్‌లోని కేఎన్‌ఆర్ నగరపాలక పాఠశాల స్కూల్ గోడ కూలి ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేశ్ బాధితకుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, మంగళవారం నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వారి ఇంటికెళ్లి చెక్కు అందజేశారు. కుటుంబానికి ఇంటి స్థలం, మరో కుమారుడి చదువుకు సహకరిస్తామని శ్రీధర్‌రెడ్డి చెప్పారు. మానవ తప్పిదం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.