తెలంగాణవీణ, సినిమా : తమిళనాట విజయ్ సేతుపతికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన 50వ సినిమాగా ‘మహారాజ’ రూపొందింది. తమిళంతో పాటు, తెలుగులోనూ ఈ సినిమా జూన్ 14వ తేదీన విడుదలైంది. 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీ నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.మహారాజ విజయ్ సేతుపతి చెన్నైలోని ఒక ప్రాంతంలో సెలూన్ షాపు నడుపుతూ ఉంటాడు. భార్య .. కూతురు జ్యోతి .. ఇది అతని కుటుంబం. ఒక ప్రమాదంలో భార్య చనిపోవడంతో, కూతురును తానే పెంచుతాడు. ఆ అమ్మాయి టీనేజ్ లోకి అడుపెడుతుంది. కూతురంటే మహారాజకి ప్రాణం. జ్యోతి కూడా చిన్నప్పుడే తల్లితో పాటే చనిపోవలసిందే. కానీ రేకుతో చేసిన ఒక ‘చెత్త డబ్బా’ ఆ అమ్మాయిని కాపాడుతుంది. అప్పటి నుంచి ఆ రేకు డబ్బాకు ‘లక్ష్మి’ అని పేరు పెట్టి అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు.
ఒక రోజున స్కూల్ కి సంబంధించిన ఒక క్యాంప్ కి జ్యోతి వెళుతుంది. ఆ సమయంలోనే మహారాజ పోలీస్ స్టేషన్ కి వెళతాడు. ఓ ముగ్గురు దుండగులు తన ఇంట్లోకి ప్రవేశించి .. తనని గాయపరిచి .. తన లక్ష్మిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తాడు. ‘లక్ష్మి’ అంటే చెత్త డబ్బా అని తెలుసుకుని వాళ్లు షాక్ అవుతారు. అతని మానసికస్థితి సరిగ్గా లేదని పోలీస్ ఆఫీసర్స్ భావిస్తారు. అయితే ‘లక్ష్మి’ని వెతకిపెడితే ఐదు లక్షలు ఇస్తానని అతను అనడంతో వాళ్లు నివ్వెరపోతారు , ఆ చెత్త డబ్బాలో అతను చాలా విలువైనవేవో దాచి ఉంచి ఉంటాడని పోలీసులు భావిస్తారు. ఇదిలా ఉండగా, సెల్వ (అనురాగ్ కశ్యప్) .. అతని స్నేహితుడు శబరి ( వినోద్ సాగర్) దొంగతనాలు చేస్తూ వెళుతుంటారు. అలా ఒకసారి వాళ్లు దొంగతనం చేయడమే కాకుండా, ఇద్దరి మహిళలను సజీవ దహనం చేస్తారు. దోచిన డబ్బును .. నగలను ఒక దగ్గర దాచిపెడుతూ ఉంటారు. ఒక సారి తన కూతురు బర్త్ డే సందర్భంగా సెల్వా ఒక గోల్డ్ చైన్ కొంటాడు. ఆ చైన్ ను అతను మహారాజ సెలూన్ షాపులో మరిచిపోతాడు. ఆ చైన్ ఇవ్వడానికి మహారాజ అతని ఇంటికి వెళతాడు. సరిగ్గా ఆ సమయంలోనే పోలీసులు ఎంటరవుతారు. సెల్వాను అరెస్టు చేసి తీసుకుని వెళతారు. అందుకు మహారాజ కారణమని భావించిన సెల్వా పగబడతాడు. అతని వలన మహారాజకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? మహారాజ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది కథ.
నిథిలన్ స్వామినాథన్ అల్లుకున్న కథ ఇది. దొంగలు తన లక్ష్మి (చెత్త డబ్బా)ని ఎత్తుకెళ్లారనీ, అది వెతికి పెట్టే వరకూ తాను స్టేషన్ లో నుంచి కదలనని మహారాజ అక్కడే కూర్చుంటాడు. చెత్త డబ్బా కోసం అతను అంత పట్టుపడటం తెరపై పోలీస్ లకు మాత్రమే కాదు, మనకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దాని వెనుక ఏదో మతలబు ఉందని మాత్రం మనకి అనిపిస్తుంది. అదేమిటో తెలుసుకున్నాక కన్నీళ్లు పెట్టని వాళ్లు మాత్రం ఉండరు.ఒక చెత్త డబ్బా నుంచి కథను మొదలుపెట్టిన దర్శకుడు, అంచలంచెలుగా కథను తీసుకుని వెళ్లే తీరును ప్రేక్షకులు అంచనా వేయలేరు. ఎలాంటి హడావిడి చేయకుండా కథను ఇటు హీరో వైపునుంచి .. అటు విలన్ వైపు నుంచి నడిపించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే .. ఎమోషన్స్ హైలైట్. ఇవి ఈ సినిమాను నిలబెట్టేశాయి అంతే. ఒక పోలీస్ స్టేషన్ .. ఒక పాత ఇల్లు .. ఒక సెలూన్ షాపు. సింపుల్ గా కథ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది .. బలమైన ఎమోషన్స్ తో టచ్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాకి ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ప్రాణంలా నిలుస్తాయి. భారీ సినిమాలలోని క్లైమాక్సులు ఖర్చుతో కూడుకుని ఉంటాయేమోగానీ, ఇలా కదిలించే క్లైమాక్స్ లు ఉన్న కథలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ సినిమాకి ఇంతకుమించిన క్లైమాక్స్ ను డిజైన్ చేయడం సాధ్యం కాదు అనే లెవెల్లో ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో ఇంతటి ప్రభావం చూపించిన సినిమాలలో ‘ఖైదీ’ తరువాత స్థానంలో ‘మహారాజ’ నిలుస్తుంది. ఈ సినిమా చూసినవాళ్లకి తెరపై విజయ సేతుపతి కనిపించడు. ఆయన పోషించిన ‘మహారాజ’ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆ పాత్ర వలన అతను మనసున్న ‘మహారాజు’ అనే అనిపిస్తుంది. దినేశ్ పురుషోత్తమన్ ఫొటోగ్రఫీ .. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం .. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఈ సినిమాకి అదనపుబలంగా నిలిచాయి. ఓ మాదిరి బడ్జెట్ లో చేసిన ఈ సినిమా, ఎందుకు 100 కోట్లకు పైగా కొల్లగొట్టిందనేది సినిమా చూసిన తరువాతనే అర్థమవుతుంది.