తెలంగాణవీణ జాతీయం : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన ఖరీదైన బ్లాక్ లక్సెస్ కారుతో ఏకంగా నడుములోతు నీటిలోకి వెళ్లారు. ఇదంతా ఎందుకని అంటారా..? దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వచ్చిన వరదల పరిస్థితిని అంచనావేసేందుకు ఆయన అలా చేయాల్సివచ్చింది. గత కొన్ని రోజులుగా ఉ.కొరియాలో కుంభ వృష్టి వర్షాలు కురిశాయి. దీంతో వేల మంది నిరాశ్రయులయ్యారు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు అనే పట్టణాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10 విమానాల్లో దాదాపు 4,200 మందిని తరలించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా చెబుతోంది. దీంతో కిమ్ ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లారని పేర్కొంటూ.. నడములోతు నీటిలో ఉన్న బ్లాక్ లక్సెస్ కారు, అందులోని కిమ్ చిత్రాలను స్థానిక మీడియాలో ప్రచురించారు. అధ్యక్షుడే నేరుగా ఈ ప్రకృత్తి విపత్తు సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారని ఆ కథనాల్లో పేర్కొన్నారు. విమానాలు, హెలికాప్టర్లు ఉండగా.. కిమ్ కారులోనే ఎందుకు నీటిలోకి వెళ్లాల్సి వచ్చిందని ఈ చిత్రాలను చూసివారు చర్చించుకంటున్నారు. ఈ నెలలో కయిసాంగ్ నగరంలో 18.2 సెంటీమీటర్ల వర్షం ఒక్క రోజులో కురిసింది. 29 ఏళ్ల్లలో ఉత్తర కొరియాలో ఈ స్థాయి వర్షపాతం ఎప్పుడూ చూడలేదని దక్షిణ కొరియా వాతావరణ శాఖ చెబుతోంది. తాజాగా విరుచుకుపడ్డ వరదలు ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు భయపడుతున్నారు. ఇక్కడ నీటి పారుదల వ్యవస్థ దారుణంగా ఉండటంతో నష్టం తీవ్రంగానే ఉంటుందని అంచనావేశారు. ఈ సారి వరద నష్టాన్ని మాత్రం కేసీఎన్‌ఏ ప్రకటించలేదు