కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య ఇంకా సయోధ్య కుదరలేదా..? పెద్దాయనను బుజ్జగించిన అధిష్టానం ఇద్దరూ కలిసి పని చేసుకోవాలన్న ఆదేశాలు ఇవ్వడంలో విఫలం అయిందా..? జగిత్యాల హస్తం పార్టీ రాజకీయం హస్తిన వరకూ చేరినా అభిప్రాయ బేధాలతోనే ఆ ఇద్దరు నేతలు ముందుకు సాగుతున్నారా..? అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు గమనిస్తే..!
జగిత్యాల పట్టణంలో బోనాల జాతర సందర్భంగా ఎమెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీల తొలగింపు నేపథ్యంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జగిత్యాలలో ఉండనిస్తారా లేదా అంటూ సీనియర్ నేత చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ ఫ్లెక్సీల తొలగింపునకు అసలు కారణం జీవన్ రెడ్డి అంశం కాదని, ఎమ్మెల్యే సంజయ్ ఫోటో లేని విషయం కూడా సీరియస్ గా తీసుకోలేదన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీల్లో మునిసిపల్ ఉద్యోగి ఫోటో ఉందన్న కారణంగానే వాటిని తొలగించాల్సి వచ్చిందని మునిసిపల్ యంత్రాంగం చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ద్వారా మిశ్రమ స్పందనే కనిపించింది. చాలా ఫ్లెక్సీల్లో కేవలం ఎమ్మెల్యే ఫోటో మాత్రమే ముద్రించగా, కొన్నింటిలో మాత్రం జీవన్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేశారు. దీంతో ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదన్న చర్చ జగిత్యాలలో సాగుతోంది. నిన్న మొన్నటి వరకూ ప్రత్యర్థులుగా ఉన్న ఈ నేతల మధ్య అభిప్రాయ బేధాలను పరిష్కరించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అంత సీరియస్ గా తీసుకోనట్టుగా కనిపిస్తోంది. ఈ కారణంగానే ఇద్దరు నాయకులు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నడుచుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికీ కలుసుకోని నేతలు..!
సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో చర్చలు జరిపిన అధిష్టానం స్థానిక నాయకత్వానికి చెప్పకుండానే పార్టీలో చేర్పించుకున్న తీరు స్థానికంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కినుక వహించిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిని సముదాయించేందుకు మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగినా ఆయన ససేమిరా అన్నారు. చివరకు శ్రీధర్ బాబు అధిష్టానంతో చర్చించి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు చొరవ తీసుకోవాలని కీలక నేతల దృష్టికి తీసుకెళ్లారు. తన పదవికి రాజీనామా చేయాలన్న యోచనకు వచ్చిన జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిన ఏఐసీసీ పెద్దలు ఆయనతో మాట్లాడి సంజయ్ చేరికపై సానుకూలతను వ్యక్త పరిచారు. దీంతో జగిత్యాల కాంగ్రెస్ పంచాయితీ టీ కప్పులో తుపానేనని భావించారంతా. కానీ ప్రస్తుతం పట్టణంలో నెలకొన్న పరిణామాలు మాత్రం ఇద్దరు నేతల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న సంకేతాలను ఇస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత జగిత్యాలకు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తన పనిలో తాను మునిగిపోయారు తప్పా సీనియర్ నేత జీవన్ రెడ్డిని కలిసేందుకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదట. దీంతో ఆయన తన వర్గీయులతోనే ఉండాలని నిర్ణయించుకున్నారన్న భావన స్థానికంగా వ్యక్తం అవుతోంది. జన్మదిన సందర్భంగా అయినా వీరిద్దరి మధ్య సయోధ్య కుదురుతుందని భావించినప్పటికీ, అలాంటి సానుకూల వాతావరణం మాత్రం జగిత్యాలలో కనిపించడం లేదు. దీంతో జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది అన్న చర్చ అటు పార్టీ క్యాడర్ లో ఇటు ద్వితీయ శ్రేణి నాయకుల్లో సాగుతోంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కు పుల్ స్టాప్ పెట్టనట్టయితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.