తెలంగాణవీణ ఏపీ బ్యూరో:: రాజేష్ తండ్రి చిట్టయ్య గొర్రెలు పెంచుతూ.. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. చిన్నప్పటి నుంచి బిడ్డను సైన్యంలో చేర్పించాలని అనుకునేవారు. అందుకు అనుగుణంగానే రాజేష్ కూడా తండ్రి కోరిక నెరవేర్చాలనే పట్టుదల, దేశ సేవ చేయాలనే తపనతో ఉండేవారు. చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. దండుగోపాలపురం పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఉత్తమ విద్యార్థిగా, క్రీడాకారుడిగా పేరు సంపాదించుకున్నారు. 2018లో సైన్యంలో చేరిన రాజేష్ మూడేళ్లలోనే ఉత్తమ ప్రతిభ చూపి నాయక్ స్థాయికి చేరారు. ఆరేళ్లుగా సరిహద్దు నుంచి స్వగ్రామానికి వచ్చిన ప్రతిసారీ పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనందించేవారు. సామాజిక కార్యక్రమాలకు విరాళాలు అందజేసి అందరి మన్ననలు పొందారు. రాజేష్ మృతికి ఎంతో మంది నివాళులర్పిస్తున్నారు. పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో భరతమాత ముద్దుబిడ్డగా చరిత్రలో నిలిచిపోయావంటూ కీర్తిస్తూ అంజలి ఘటిస్తున్నారు. పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు బాధిత కుటుంబ సభ్యులతో బుధవారం ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. మా బిడ్డను తలచుకుంటే గర్వంగా ఉంది..వీర మరణం పొందిన రాజేష్ తల్లిదండ్రులు చిట్టయ్య, పార్వతిలను పరామర్శించేందుకు బంధుమిత్రులు బుధవారం పెద్దఎత్తున వారింటికి తరలివచ్చారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి దేశం కోసం కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉందంటూ వారు ప్రకటించారు. ‘చీమకు కూడా హాని తలపెట్టని మా బిడ్డను భరతమాత తన ఒడిన చేర్చుకుంది. ఏ రోడ్డు ప్రమాదంలోనో. మరే విధంగానో మాకు దూరమై ఉంటే బాధపడేవాళ్లం. దేశం కోసం పది మందిని కాపాడి అమరుడు కావడాన్ని తలచుకుంటే గర్వంగా ఉంది.’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు.. ఘటనతో చెట్లతాండ్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. చెట్లతాండ్రలో అంతిమ సంస్కారాలు..రాజేష్ భౌతికకాయం బుధవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరింది. అక్కడ అధికారులు నివాళులర్పించిన అనంతరం రోడ్డు మార్గంలో గురువారం ఉదయం చెట్లతాండ్ర గ్రామానికి తీసుకొస్తారు. అనంతరం స్వగ్రామంలోనే అంత్యక్రియలకు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.