తెలంగాణవీణ హెద్రాబాద్ : రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దాని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పీయర్ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపు వంగి ఉంది. రుతుపవన ద్రోణి ఈ రోజు కోట, గుణ, కళింగపట్నం మీదుగా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. గాలి విచ్చిన్నతి ఈ రోజు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1కి.మీ నుంచి 5.8కి.మీ ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉంది.ఈ ప్రభావంతో రాష్ట్రంలో నాలుగురోజులపాటు వర్షాలు కురిసే అవకాశముంది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముంది. దీంతో ఆ రెండు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్ధిపేట, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.