- పిల్లల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై సాయితేజ్ ఆందోళన
- తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపు
- సోషల్ మీడియాలో పిల్లలపై వికృత ధోరణులకు అడ్డుకట్ట వేస్తామన్న భట్టి విక్రమార్క
తల్లిదండ్రులు తమ పిల్లల వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రపంచం క్రూరమైనదిగా, ప్రమాదకరంగా మారిపోయిందని తెలిపారు. అందుకే పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే ముందు తల్లిదండ్రులు కొంత వివేకంతో ఆలోచించాలని సూచించారు.
సోషల్ మీడియాలో కొందరు మృగాల వంటి మనుషులు ఉంటారని, వారిని కట్టడి చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. వినోదం పేరిట పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని… ఇది భయంకరం, అసహ్యకరం కంటే కూడా ఎక్కువ అని సాయితేజ్ పేర్కొన్నారు.
ఇప్పుడు పిల్లల భద్రత అత్యంత ముఖ్యమని… సోషల్ మీడియాలో ఇలాంటి వికృత ధోరణులను అరికట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు, మంత్రి నారా లోకేశ్ గారు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు.
ఈ మేరకు ఓ చిన్నారి బాలికకు సంబంధించిన వీడియోను కూడా సాయితేజ్ పంచుకున్నారు. ఆ వీడియోపై కొందరు వ్యక్తులు ఆన్ లైన్ లో చాటింగ్ చేసిన విధానాన్ని సాయితేజ్ ప్రస్తావించారు.
దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఎంతో కీలక సమస్యను ఎత్తిచూపినందుకు సాయితేజ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చిన్నారుల భద్రత ఎప్పటికీ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమేనని పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికల్లో చిన్నారులపై వికృత ధోరణులు, వేధింపులను అరికట్టేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పిల్లలకు మరింత మెరుగైన ఆన్ లైన్ వాతావరణాన్ని అందించేందుకు మనం కలిసి పనిచేద్దాం అని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.