తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జగన్నాథ రథయాత్రను ప్రారంభించారు. స్వామివారికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇస్కాన్ సంస్థ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, జగన్నాథుడి శోభాయాత్రను హైదరాబాద్ నగరంలో నిర్వహించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ తెలంగాణ ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు.ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. మత సామరస్యాన్ని కాపాడుతుంది.. సర్వమతాలకు స్వేచ్ఛ ఉంటుంది. వారి భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవటానికి అవకాశం ఉంటుందని, అదే సమయంలో భక్తులకు అవసరమైన వసతులు, ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఈ యాత్ర ద్వారా భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.