ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇప్పటికే రూపొందించిన ప్రభుత్వం రేపటి(జూలై 8) నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలుత అన్ని చోట్ల స్టాక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుక పంపిణీ చేస్తారు. నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు 20 రూపాయలు, సీనరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు వసూలు చేయనున్నారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీ చేస్తారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఇసుక తవ్వి ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది.ఇసుక అక్రమ తవ్వకాలపైన ప్రభుత్వం నిఘా ఉంచింది. వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఇసుకను మనుషులతో తవ్వి తీయించి లారీల్లో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గనులశాఖకు కొంత ఖర్చు అవుతుంది. ఈ ఫీజులను ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయించనున్నారు. రీచ్ లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి.. ఈ ఫీజులు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి.
ఏపీ వ్యాప్తంగా 83 బీ1 కేటగిరీ రీచ్ ల పరిధిలో ఇసుక డిపోలు ఉన్నాయి. వాటిని గనుల శాఖ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. డిపోల్లో ఉన్న ఈ ఇసుకను రేపటి(జూలై 8) నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధివిధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్లబండి వంటి వాహనాలు తీసుకొచ్చి ఇసుకను తీసుకెళ్లవచ్చు. ఇసుక అవసరం ఉన్న వారు ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ ఛార్జీలు గ్రామ పంచాయితీలకు ఇచ్చి 88 రూపాయల ఫీజును ఆన్ లైన్ లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానుంది ప్రభుత్వం.