తెలంగాణవీణ హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎన్టీవీ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 2ను మూడుసార్లు వాయిదా వేశారన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. కానీ పదేళ్ల పాటు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు.తాము అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే చాలామంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని, డీఎస్సీ నిర్వహిస్తున్నామనీ అన్నారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇస్తామన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇక ఇస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. టీజీపీఎస్సీ ద్వారా 13,321 పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తమ హామీలపై విపక్షాలవి అడ్డగోలు మాటలని మండిపడ్డారు.హామీలపై తాము మాట తప్పేది లేదు… మడమ తిప్పేది లేదన్నారు. రైతు రుణమాఫీపై విపక్షాలు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామన్నారు. అసలు, వడ్డీ కలిపి గరిష్ఠంగా రూ.2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కమిషన్ వద్దని కేసీఆర్ వాదిస్తున్నారని ఆరోపించారు.