తెలంగాణవీణ జాతీయం : దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం లో మానవత్వం పరిఢవిల్లింది. ప్రాణాపాయంలో ఉన్న వృద్ధుడిని చూసి అక్కడే ఉన్న ఓ వైద్యురాలు తక్షణమే స్పందించారు. వృత్తి ధర్మాన్ని పాటించి ఆయన ఆయువు నిలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..దిల్లీ ఎయిర్‌పోర్టు రెండో టర్మినల్ వద్ద బుధవారం 60ఏళ్లు పైబడిన ఓ వృద్ధుడు గుండెపోటు కు గురయ్యారు. ఫుడ్‌కోర్టు ఏరియా వద్ద ఉన్నట్టుండి కుప్పకూలారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళా డాక్టర్ వేగంగా స్పందించారు. ఆ వ్యక్తి ఛాతీపై గట్టిగా నొక్కుతూ సీపీఆర్ చేశారు. ఆమె కృషి ఫలించి సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఆ వృద్ధుడు స్పృహలోకి వచ్చారు.ఈ ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ కాగా.. వైద్యురాలిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె వివరాలేమీ తెలియరానప్పటికీ హీరో డాక్టర్ అంటూ కొనియాడుతున్నారు.