తెలంగాణవీణ జాతీయం : ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్‌కు ఇంకా 9 రోజుల సమయమే ఉంది. విశ్వ క్రీడాసంబరం ఒలింపిక్స్ ఈనెల 26 నుంచే ప్రారంభం కానుంది. పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా క్రీడలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. ఈసారి భారత్ 117 మంది అథ్లెట్లను ఒలింపిక్స్‌కు పంపుతోంది. ఇందుకు సంబంధించిన జాబితాకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే, ఈ జాబితాలో మహిళా షాట్‌పుటర్ అబా కతువా పేరు లేకపోవడం గమనార్హం. ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో ఆమె పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమె పేరును ఎందుకు తొలగించారనే దానిపై స్పష్టత లేదు. అథ్లెట్లతోపాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారుల బృందం కూడా పారిస్‌కు వెళ్లనుంది. ఇందులో 72 మంది ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. నిబంధనల ప్రకారం సహాయక సిబ్బంది సంఖ్య 67 మించకూడదు. దీంతో ఐదుగురు వైద్య బృందం, సహాయక సిబ్బంది 67 మందికి ప్రభుత్వం ఖర్చులు భరించనుంది. భారత అథ్లెటిక్స్ బృందంలో 29 మంది ఉండగా 11 మహిళ, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్ టీమ్‌లో 21, హాకీ జట్టులో 19 మంది ఉన్నారు. టేబుల్ టెన్నిస్ (8), బ్యాడ్మింటన్ (7), రెజ్లింగ్ ( 6), ఆర్చరీ (6), బాక్సింగ్ (6), గోల్ఫ్ (4), టెన్నిస్ (3), స్విమ్మింగ్ (2), సెయిలింగ్ (2), ఈక్వస్ట్రియన్, జుడో, రోయింగ్, వెయింట్ లిప్టింగ్ విభాగంలో ఒక్కొక్కరు పోటీపడుతున్నారు. 2021లో జావెలిన్‌త్రోలో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన నీరజ్ చోప్రా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్‌లోనూ పతకాల ఆశలు రేపుతున్న క్రీడాకారులు చాలామందే ఉన్నారు. భారత్ బృందానికి చెఫ్ దే మిషన్‌గా షూటర్ గగన్ నారంగ్ నియమితులయ్యారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్ తరఫున టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్‌తోపాటు మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు పతాకధారిగా వ్యవహరించనున్నారు.