తెలంగాణ వీణ, జాతీయం : గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మహారాష్ట్రలోని నాగపూర్ లో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వార్తలు వచ్చాయి. దీనిపై భారత వాతావరణ శాఖ వివరణ ఇచ్చింది. నాగపూర్ లో నమోదైంది 56 డిగ్రీలు కాదని స్పష్టం చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన వాతావరణ సెన్సర్లు సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందని ఐఎండీ వెల్లడించింది. నాగపూర్ లో తాము నాలుగు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ (ఏడబ్ల్యూఎస్)ను ఏర్పాటు చేశామని, అందులో ఒకటి 56 డిగ్రీలు చూపించగా, మరొకటి 54 డిగ్రీల ఉష్ణోగ్రతను చూపించిందని, కానీ మరో రెండు ఏడబ్ల్యూఎస్ లలో 44, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చూపించాయని ఐఎండీ వివరణ ఇచ్చింది. ఈ ఎలక్ట్రానిక్ సెన్సర్లు ఒక్కోసారి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రతలను తప్పుగా చూపిస్తుంటాయని, నాగపూర్ లోనూ అదే జరిగిందని… ఒక వెదర్ స్టేషన్ లో 56, మరో వెదర్ స్టేషన్ లో 54 డిగ్రీలు నమోదైందని తెలిపింది.