Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 రూ.500 బోనస్‌పై కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

Must read

  • సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడం సరికాదన్న హరీశ్ రావు
  • అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్న బీఆర్ఎస్ నేత
  • ఆయల్ ఫామ్ పంట లాభదాయకమన్న మాజీ మంత్రి

తెలంగాణ వీణ..తెలంగాణ:వరి ధాన్యానికి బోనస్‌పై కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి… ఇప్పుడు సన్నరకం వడ్లకే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతులను దగా చేయవద్దని కోరారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ మొట్ట మొదటి క్రాప్ కటింగ్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆయిల్ పామ్ పంటపై చాలామంది రైతుల్లో అనుమానాలు ఉండేవన్నారు. ఖమ్మం సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ పంట ద్వారా రైతులు ఎన్నో లాభాలు పొందుతున్నారన్నారు. మన రాష్ట్రంలోనూ చాలామంది రైతులు ఈ పంటను పండిస్తున్నారని తెలిపారు. ఆయిల్ పామ్ ప్రకృతి ప్రసాదించిన వరమని, రైతుల ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. స్థిర ఆదాయాన్ని ఇస్తుందన్నారు. ఎకరాకు లక్షా 20వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. అందుకే కేసీఆర్ హయాంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కోసం ప్రోత్సాహం అందించినట్లు చెప్పారు. పంటకు డ్రిప్‌తో పాటు ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ అందించామన్నారు.ఆయిల్ పామ్ విషయంలో దళారి వ్యవస్థ లేదని, ధర రాదనే బాధ ఉండదన్నారు. ఆయిల్ ఫెడ్ ద్వారా నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. రూ.300 కోట్లతో 120 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతోందని…. దేశంలోనే అతిపెద్ద ప్యాక్టరీ మనకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ వచ్చే ఏప్రిల్ నాటికి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఆయిల్ పామ్ పంటకు రైతులు ముందుకు రావాలని… మంచి ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వచ్చినట్లు రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయన్నారు.కొత్త ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించాలని కోరారు. అంతర్ పంటగా వేసే కోకో ధర కూడా బాగా పెరిగిందన్నారు. సిద్దిపేట రైతులకు కోకో కొనుగోలు చేసే కేంద్రాన్ని తీసుకువచ్చేలా చాక్లెట్ కంపెనీని కోరినట్లు చెప్పారు. అంతర్ పంటలకు అవసరమైన మెలకువలు, సహకారం ఆ కంపెనీ అందిస్తుందన్నారు. ఎంతో కష్టపడి కాళేశ్వరం ద్వారా నీటిని తెచ్చుకున్నామని, కరెంట్ ఇచ్చామని… రైతులకు మేలు జరగాలన్నదే తమ కోరిక అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. షరతుల్లేకుండా ఎకరాకు రూ.7500 ఇవ్వాలన్నారు. ప్రసంగాలలో, మేనిఫెస్టోలో పంట కాలానికి ముందే ప్రతి ఎకరాకు ఇస్తామని చెప్పి… ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతుబంధు అందరికీ రావడం లేదని… కేసీఆర్ ప్రశ్నించాక కొంతమందికి వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you