తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఓట్ల లెక్కింపు సరళితో తేటతెల్లమైంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఇప్పటికే సందడి మొదలైంది. చంద్రబాబు నివాసం వద్దకు, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటుండడంతో కోలాహలం నెలకొంది. బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు హోరెత్తించారు.నిన్ననే టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించాయి. ఇవాళ కౌంటింగ్ మొదలైన గంటకే టీడీపీ భారీ లీడింగ్ లోకి వెళ్లడంతో నేతలు, కార్యకర్తల్లో సంతోషం అంతా ఇంతా కాదు. కోనసీమ, రాయలసీమ, కోసాంధ్రలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, వైసీపీ బాగా వెనుకబడినట్టు ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ తీరు చెబుతోంది. సొంతంగా టీడీపీ 125 స్థానాల్లో ముందంజలో ఉండగా, భాగస్వామ్య పక్షాలైన జనసేన 17, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అధికార వైసీపీ 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.