- రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేసిన బీజేపీ నేతలు
- తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పరువు నష్టం కేసు
- 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు
- ప్రతీ పనిలోనూ 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపించిన కాంగ్రెస్ అగ్రనేత
తెలంగాణ వీణ,హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. పరువు నష్టం కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2019-2023 పాలనలో రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని విమర్శించారు.
ప్రతీ పనిలోనూ 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపించారు. దీంతో రాహుల్ ఆరోపణలపై కర్ణాటక బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు అప్పటి ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ కేశవ్ ప్రసాద్ ఆ పార్టీ తరఫున పరువు నష్టం దావా వేశారు.
‘40 శాతం కమీషన్ ప్రభుత్వం’గా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇప్పించారని తెలిపారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ ‘రేటు కార్డులు’ పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించి తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇక ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు గత వారం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న రాహుల్ గాంధీని కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నేడు న్యాయమూర్తి ఎదుట రాహుల్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరు ప్రత్యేక కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 30వ తేదీకి వాయిదా వేసింది.