- విమానం ఎక్కాక సహ ప్రయాణికురాలితో గొడవ
- వద్దన్నా వినకపోవడంతో విమానం నుంచి దించివేత
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
తెలంగాణవీణ..జాతీయ:విమాన సిబ్బందిపై దాడిచేసి, ఆపై కొరికి గాయపరిచిన మహిళా ప్రయాణికురాలిపై లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. నిందితురాలైన మహిళ ముంబై వెళ్లేందుకు లక్నో విమానాశ్రయానికి చేరుకుంది. సాయంత్రం 5.25 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. విమానం ఎక్కిన మహిళ సహ ప్రయాణికురాలపై అరుస్తూ గొడవకు దిగింది. అది చూసిన విమాన సిబ్బంది గొడవ పడొద్దని, సైలెంట్‌గా ఉండాలని సూచించడంతో వెనక్కి తగ్గింది. అయితే, ఆ తర్వాత మళ్లీ ఆమె గొడవ పెట్టుకోవడంతో కేబిన్ క్రూ సమాచారం ఇవ్వడంతో గ్రౌండ్ సిబ్బంది వచ్చి ఆమెను విమానం నుంచి దింపేశారు. విమానం నుంచి దిగుతున్న సమయంలో గ్రౌండ్ సిబ్బందిలో ఒకరిపై దాడిచేసిన మహిళ అతడి మణికట్టును కొరికేసింది. దీంతో రంగంలోకి దిగిన సీఐఎస్ఎఫ్ ఆమెను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగ్రాకు చెందిన నిందితురాలు ముంబైలో నివసిస్తోంది. తన సోదరిని కలిసేందుకు లక్నో వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ఆమెను బంధువుల ఇంటికి పంపినట్టు పేర్కొన్నారు.