బహుభాషా కోవిదుడు పీవీ ఎందరికో ఆదర్శం
ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన జ్ఞాని
కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు… శేరి సతీష్ రెడ్డి
తెలంగాణవీణ – కూకట్ పల్లి….దివంగత భారత ప్రధాని పీవీ నరసింహారావు అమోఘమైన తెలివితేటలకు నిదర్శనమని, కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి అన్నారు. దివంగత భారత ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని, శుక్రవారం కె పి హెచ్ బి కాలనీలో శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో, పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలు తీసుకువచ్చి , దేశం ఈ నాడు ఇంత గొప్ప ఆర్థికశక్తిగా వెలుగొందడానికి పునాదులు వేసిన అపర చాణుక్యుడు అని కొనియాడారు. ఇహలోక బంధాలన్నీ వదిలేసి, కుర్తాలం పీఠాధిపతిగా వెళ్దామని సిద్ధపడుతున్న తరుణంలో దేశమాత పిలుపు వచ్చిందన్నారు. ఎంత మందో అధికార పీఠం కోసం అర్రులు చాస్తున్న వేళ, తానొచ్చి ప్రధాన పదవి పీఠాన్ని అధిష్ఠించారని అన్నారు. ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళ పాటు విజయవంతంగా నడపడంలో అనేక సవాళ్ళు, ఆటుపోట్లు, అపనిందలు ఎదుర్కున్నారని గుర్తు చేశారు. పదవిలో ఉండగానే, కోర్టు ఖర్చు కోసం, ఇల్లు కూడా అమ్ముకున్న స్థిత ప్రజ్ఞుడని కొనియాడారు. హంగూ, ఆర్భాటం, ఆడంబరం, అతిశయం, ప్రచార యావ లేని నిరాడంబర, రాజనీతిఙ్ఞుడని పేర్కొన్నారు.పీవీ నరసింహారావు లాంటి గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రజితమ్మ, జోజమ్మ, బి సంజీవరావు, మేకల మైకల్, బి బ్లాక్ అధ్యక్షరాలు రేష్మ, మాజీ వార్డు సభ్యురాలు మనీ అమ్మ ,వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి ఫణీంద్ర కుమార్ ,బాబ్జి కుమార్, నాగమల్లేశ్వరరావు లుంగీ రాజు ,రాజు ముదిరాజు, శేషగిరిరావు, సూరిబాబు, కొమ్ము బాబు, తదితరులు పాల్గొన్నారు.