- అమెరికా, వెస్టిండీస్ లో కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్
- రేపు (జూన్ 9) భారత్, పాకిస్థాన్ మ్యాచ్
- అందరి దృష్టి దాయాదుల సమరం పైనే!
తెలంగాణ వీణ..భారతదేశం:వరల్డ్ కప్ అంతా ఒకెత్తయితే అందులో భారత్-పాకిస్థాన్ పోరు మరో ఎత్తు. ఇప్పుడా రసవత్తర తరుణం రానే వచ్చింది. రేపు (జూన్ 9) టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. దాంతో ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ మేనియా వచ్చినట్టు ఊగిపోతున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు దాయాదుల సమరం ప్రారంభం కానుంది. న్యూయార్క్ నగరంలోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టికెట్లన్నీ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా, పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే టీమిండియా ఆటగాళ్లు 100 శాతం పోరాటం ప్రదర్శిస్తారు. అందుకే, ప్రాక్టీసులో చెమటోడ్చుతున్నారు. ఈ క్రమంలో సాధన సమయంలో భారత ఆటగాళ్లు ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తనదైన శైలిలో నవ్వుతూ, తుళ్లుతూ, సహచరుల్లో ఉత్తేజం నింపుతూ దర్శనమిచ్చాడు. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్ లో సీరియస్ గా బ్యాటింగ్ ప్రాక్టీసు చేశాడు. కాగా, దక్షిణాఫ్రికా జట్టు కూడా న్యూయార్క్ లోనే ఉండడంతో, ఆ జట్టులో ఒక ఆటగాడు (డేవిడ్ మిల్లర్…?) టీమిండియా ప్రాక్టీసును చూసేందుకు రాగా, చహల్ అతడ్ని ఆత్మీయంగా పలకరించడం ఫొటోలో చూడొచ్చు.