- రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
- హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఘట్‌కేసర్ పరిధిలోని ప్రజలు ఒంటరిగా తిరగవద్దని సూచన
- అర్ధరాత్రుళ్లు తలుపు తడితే తీయవద్దని సూచన
- అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేయాలని సూచన
- తెలంగాణ వీణ…హైదరాబాద్:దోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో తిరుగుతోందని పోలీసులు నగరవాసులను హెచ్చరిస్తున్నారు. ఈ ధార్ గ్యాంగ్ నగరంలోని శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ గ్యాంగ్ ఇప్పటికే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో చోరీ చేసినట్లు వెల్లడించారు.ప్రజయ్ గుల్మోహర్‌లో ప్రహరీ గోడపై ఏర్పాటు చేసిన సోలార్ వైర్లను కట్ చేసి లోపలికి జొరబడ్డారని… ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇంట్లోని నగదు, బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి… దర్యాఫ్తు చేయగా, చోరీకి పాల్పడింది ధార్ గ్యాంగ్‌గా తెలిందని వెల్లడించారు. హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలు రాత్రిళ్లు ఒంటరిగా తిరగవద్దని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ గ్యాంగ్ సభ్యులు శివారులోని హోటల్స్‌లో ఉంటున్నట్లు చెప్పారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఒక్కో గ్యాంగులో ఐదుగురు, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అర్ధరాత్రుళ్లు ఎవరైనా తలుపు తడితే తీయవద్దని… వచ్చిన వారు ఎవరో నిర్ధారంచుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు.