- గుజరాత్‌లో అధికారుల వినూత్న స్కీం
- బాధితులపై భారం పడకుండా వాయిదాల పద్ధతిలో వసూలు
- సర్పంచ్ నుంచి పోలీసుల వరకు అందరిదీ ఒకే దారి
- ఈ తరహా అవినీతి ఇటీవల బాగా పెచ్చుమీరిందన్న రాష్ట్ర ఏసీబీ
తెలంగాణ వీణ,హైదరాబాద్:ఈఎంఐ.. ప్రస్తుతం అందరికీ పరిచయమైన పదం. ఒకేసారి డబ్బులు చెల్లించి వస్తువునో, మరో దానినో తీసుకోలేని వారు నెలవారీ వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లించి వాటిని సొంతం చేసుకుంటారు. గృహ, వాహన రుణాలు కూడా ఇలా ఈఎంఐ రూపంలోనే ఉంటాయి. మధ్య తరగతి వారికి ఇది సౌకర్యవంతమైన పద్ధతి కూడా.ఇప్పుడీ వాయిదాల పద్ధతి లంచానికి కూడా పాకింది. గుజరాత్‌లోని కొందరు అవినీతి అధికారులు బాధితులపై కనికరం చూపుతూ ఈఎంఐ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒకేసారి పెద్దమొత్తంలో లంచం డబ్బులు ఇచ్చుకోలేని వారి విషయంలో దయ చూపుతున్న అధికారులు ఆ మొత్తాన్ని నెలకింత అని వారే విభజించి వాయిదాల పద్ధతిలో పుచ్చుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిన గుజరాత్ అధికారుల వ్యవహారం విస్తుగొలుపుతోంది. రూపాలు మార్చుకుంటున్న అవినీతిని చూసి దేశం విస్తుపోతోంది. ఈ ఏడాది మొదట్లో గుజరాత్‌ను నకిలీ ఎస్‌జీఎస్టీ బిల్లింగ్ కుంభకోణం కుదిపేసింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఓ వ్యక్తి నుంచి రూ. 21 లక్షలు డిమాండ్ చేసిన అధికారులు అంతమొత్తం ఒకేసారి ఇవ్వలేనని చెప్పడంతో ఆ మొత్తాన్ని నెలకు రూ. 2 లక్షల చొప్పున 9 నెలలు, మిగతా రూ. 3 లక్షలను నెలకు రూ. లక్ష చొప్పున మొత్తం ఏడాదిలో చెల్లించాలంటూ బాధితుడికి ఈఎంఐ ఆఫర్ ఇచ్చారు. మరో కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 4న సూరత్‌కు చెందిన ఓ సర్పంచ్ ఓ భూ వివాదానికి సంబంధించి ఓ రైతు నుంచి రూ. 85 వేలు డిమాండ్ చేశాడు. ఆ రైతు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఆ అధికారి కరుణ చూపించాడు. డౌన్ పేమెంట్ కింద రూ. 35 వేలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని మూడు ఇన్‌స్టాల్‌మెంట్లుగా విభజించి రైతుపై ఆర్థికభారం పడకుండా ఉదారత చాటుకున్నాడు. తాజాగా సబరకాంత జిల్లాలో ఇద్దరు పోలీసులు రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ దొరికారు. వారిని విచారిస్తే కళ్లు బైర్లు కమ్మే విషయం బయటపడింది. ఓ కేసులో బాధితుడి నుంచి రూ. 10 లక్షలు డిమాండ్ చేసిన పోలీసులు.. తొలి వాయిదా చెల్లింపు కింద ముట్టజెప్పిన రూ. 4 లక్షలు తీసుకుని పట్టుబడ్డారు. ఈ ఈఎంఐ బాగోతాలపై గుజరాత్ ఏసీబీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ తరహా అవినీతి ఇటీవల విచ్చలవిడిగా పెరిగినట్టు చెప్పారు. ఈ ఏడాది ఇలాంటివి ఇప్పటి వరకు 10 కేసులు వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు