తెలంగాణ వీణ : ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కేశినేని నాని… సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ (చిన్ని) చేతిలో ఓటమిపాలవడం తెలిసిందే. కాగా, కేంద్ర మంత్రి వర్గంలోకి ఇద్దరు టీడీపీ ఎంపీలను తీసుకున్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి, పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయమంత్రి పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో, కేశినేని నానీని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “అయ్యా కోవర్ట్ నానీ… పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు పిలిచి నీకు పార్టీ లోక్ సభ విప్ ఇస్తానంటే వద్దన్నావు. అది చాలా పెద్ద పదవి అని, దాని బాధ్యత తీసుకోలేనని తిరస్కరించావు. నువ్వు ఆ బాధ్యత తీసుకోలేవనే, నీది రతన్ టాటా రేంజి అని తెలిసే నిన్ను పక్కనబెట్టారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, అందుకే నిన్ను పక్కనబెట్టి నీ తమ్ముడి కేశినేని చిన్నిని విజయవాడ ఎంపీగా గెలిపించారు. పక్కనే ఉన్న గుంటూరు పార్లమెంటు స్థానంలో గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ ను కేంద్రమంత్రివర్గంలోకి పంపించారు. దీన్నిబట్టి అర్థమైంది ఏంటంటే… చెడపకురా చెడేవు” అంటూ బుద్ధా వెంకన్న దెప్పి పొడిచారు.