తెలంగాణ వీణ, హైదరాబాద్ : టాలీవుడ్ నటి హేమకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ షాకిచ్చింది. మా అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేసింది. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత నెల 20న బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమ దొరికిపోయింది. వైద్య పరీక్షల్లోనూ ఆమె పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇటీవల ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా జూన్ 14వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని మా లోని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఈ విషయంపై ఆచితూచి వ్యవహరించారు. హేమను సస్పెండ్ చేయాడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ బుధవారం మా అసోసియేషన్ గ్రూప్‌లో విష్ణు మెసేజ్ పెట్టారు. అధిక శాతం మంది సభ్యులు సస్పెండ్ చేయాలని రిప్లయ్‌లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మా అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేశారు. ఆమెకు క్లీన్‌చిట్ వచ్చేంత వరకు సస్పెండ్ కొనసాగనుంది.