తెలంగాణ వీణ..ఆంధ్ర:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమించింది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావును.. కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించారు.. హెచ్‌ఓపీఎఫ్ (పోలీసు దళాల అధిపతి)గా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం రాత్రి సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ జారీచేశారు. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారికాగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సీనియార్టీ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నారు.ద్వారకా తిరుమలరావు గుంటూరువాసి కాగా.. దేవాపురంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అధికారి కాగా.. ఆయనకు తిరుమలరావు సహా ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుమలరావు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించారు.. కృష్ణ నగర్‌లోని మున్సిపల్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. సెంట్రల్ యూనివర్సిటీలో మేథ్స్‌లో గోల్డ్‌మెడల్ అందుకున్నారు. తిరుమలరావు కొంతకాలం గుంటూరు టీజేపీస్ కళాశాలలో మేథమేటిక్స్ లెక్చరర్‌గా పని చేశారు. తిరుమలరావు 1989లో ఆయన ఐపీఎస్‌రకు ఎంపికయ్యారు. ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్ కాగా.. వారికి ఇద్దరు కుమార్తెలు.ఉమ్మడి రాష్ట్రంలో తొలుత ద్వారకా తిరుమలరావు కర్నూలు ఏఎస్పీగా.. అలాగే కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా.. అనంతపురం, కడప, మెదక్ జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీగా ఆయన విధులు నిర్వర్తించారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్‌లతో పాటు ఎస్‌ఐబీలో డీఐజీగా బాధ్యతలు తీసుకున్నారు. తిరుమలరావు చెన్నై సీబీఐలో కూడా విధులు నిర్వహించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా కీలకమైన బాధ్యతల్లో కూడా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా.. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఇప్పుడు సీనియార్టీ ప్రకారం డీజీపీగా నియమితులయ్యారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఎన్నికల సంఘం తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో హరీశ్‌కుమార్ గుప్తాను నియమించింది.. ఆయన్నే డీజీపీగా కొనసాగించాలని కూటమి ప్రభుత్వం భావించింది. కానీ అనూహ్యంగా ఆయన స్థానంలో ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాలతోనే హరీష్‌కుమార్ గుప్తాను మార్చినట్లు తెలుస్తోంది.. ఆయన నెలన్నర పాటూ డీజీపీగా కొనసాగారు. ద్వారకా తిరుమలరావు డీజీపీగా ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.