తెలంగాణ వీణ ఆంధ్ర:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సొంత నియోజకవర్గం కుప్పం విచ్చేశారు. ఈ సాయంత్రం కుప్పంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కుప్పం నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని వెల్లడించారు. చాలా ఎన్నికల్లో తాను పోటీ చేశానని, ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది తొమ్మిదవ సారి అని తెలిపారు. అందులో 8 పర్యాయాలు కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యానని వివరించారు. ఇక్కడి ప్రజలు తనను తిరుగులేని మెజారిటీతో గెలిపించారని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. కుప్పం వ్యవహారాలు చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి, మండల పార్టీ నేతలకు అభినందనలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. “కుప్పం ప్రజల్లో నాపై ఒక విశ్వాసం ఉంది. నేను వచ్చినా, రాకపోయినా ఎన్నికల్లో మేం అండగా ఉంటామని కుప్పం ప్రజలు నిజాయతీని ప్రదర్శించారు. నాకు మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతాను, మళ్లీ మీ సేవకే అంకితం అవుతాను. ఈసారి ఎన్నికల్లో మాకు 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించారు. వారిని 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విర్రవీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారు. ఈ ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో మాకు విజయాలు అందించారు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు ఉంటే 21 చోట్ల గెలిపించారు. ఈ వైసీపీ ఒక అరాచక పార్టీ. అలాంటి పార్టీని ఇంటికి పంపడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాం. ఎన్డీయేలో భాగస్వామ్యం అయ్యాం. ఈ ఎన్నికలు చారిత్రాత్మకం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం. ఎప్పుడూ కూడా నా రాజకీయానికి కుప్పం ఒక ప్రయోగశాల. ఇక్కడ ప్రారంభించిన పథకాలను ఆ రోజు సమైక్యాంధ్రప్రదేశ్ లో, నవ్యాంధ్రప్రదేశ్ లో అమలు చేశాం.ఈసారి ఎన్నికల్లో చదువుకున్న యువతకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం. క్యాబినెట్ లో కూడా 17 మంది కొత్తవాళ్లకు మంత్రిగా అవకాశం ఇచ్చాం. ఏడుగురు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిస్తే, వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చాం. కుప్పం నుంచే ప్రజాక్షేత్రంలో అడుగుపెడుతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సుల కోసం ఇవాళ ఇక్కడికి వచ్చాను. నేను మీకు రుణపడి ఉన్నాను. ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటాను. కుప్పంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంతగా కుప్పంను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను. పేదరికం నిర్మూలనే నా జీవిత ధ్యేయం” అని చంద్రబాబు పేర్కొన్నారు.