తెలంగాణవీణ, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకుంది. తాము అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా నవదంపతులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 1,00,116కు తులం బంగారం జోడించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత మహిళలకు ఉచితబస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ. 500 గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ పథకంలో రూ. 5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిన ప్రభుత్వం తాజాగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు కేటాయించింది.2024-25 బడ్జెట్‌లో ఇందుకోసం కేటాయించిన రూ. 725 కోట్ల నిధుల విడుదలకు అనుమతి లభించింది. ఈ మేరకు నిన్న ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధ వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. ఇకపై వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న పేద జంటలు ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.