తెలంగాణ వీణ , హైదరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ అధికారికంగా ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో బీఎస్పీని వీడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తాను ఈ సందేశాన్ని టైప్ చేయలేకపోతున్నాను. కానీ కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున తాను తప్పక టైప్ చేయాల్సి వచ్చింది. దయచేసి క్షమించండి.. తనకు మరో మార్గం లేదు. కొత్త దారి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడుస్తాను. ఇటీవల తెలంగాణలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. స్వేరోగా తాను ఎవరినీ నిందించను. తనను నమ్మిన వారిని మోసం చేయను. మళ్లీ చెబుతున్నా.. చివరి వరకు బహుజన వాదాన్ని తన గుండెలో పదిలంగా దాచుకుంటాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ – బీఆర్ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. ఈ ప్రస్థానాన్ని ఆపలేను అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.