తెలంగాణవీణ, ఏపీ బ్యూరో : ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తొలిసారిగా స్పందించారు. టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఏర్పడడం శుభపరిణామం అని, సంతోషదాయకం అని పేర్కొన్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే ఏపీలో పొత్తులు అని వివరించారు. నాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీరాముడు… హనుమంతుడు, జాంబవంతుడు, విభీషణుడు, ఉడత సాయం కూడా తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. పొత్తులపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని, ఇక సీట్ల సర్దుబాటులపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని పురందేశ్వరి వెల్లడించారు. విజయవాడలో ఇవాళ బీజేపీ ప్రచార రథాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. “మేం ఢిల్లీ వెళ్లి ఏపీలో పరిస్థితులపై మా నాయకత్వానికి తెలియజేశాం. అనంతరం టీడీపీ, జనసేన పార్టీల అగ్రనేతలతో మా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మా పార్టీ అగ్రనేత అమిత్ షా సమాలోచనలు చేశారు. సంతోషం కలిగించే విషయం ఏంటంటే… ఏ పొత్తు గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ పొత్తు ఖరారైంది. ఎన్ని సీట్లు, ఎవరికి ఏ సీటు అనేది ఇవాళో, రేపో ఖరారు అవుతుంది. సీట్ల పంపకంపై రేపు సాయంత్రం, ఎల్లుండి లోపల మీడియాకు తెలియజేస్తాం. పొత్తుల గురించి అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం మా కార్యకర్తలకు ఉంది. రాష్ట్ర హితం కోరి పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా అందుకు కట్టుబడి ఉంటారు” అని పురందేశ్వరి వివరించారు.