Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ట్రాయ్‌ కాలర్‌ ఐడీతో స్పామ్‌ కాల్స్‌కు చెక్‌..!

Must read

తెలంగాణ వీణ , టెక్నాలజీ : అవతలి నుంచి ఎవరు ఫోన్‌ చేస్తున్నారో తెలియాలంటే ట్రూకాలర్‌ వంటి థర్డ్‌పార్టీ యాప్ మన ఫోన్‌లో ఉండాల్సిందే. అలాంటి అవసరం లేకుండా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) కొత్త ఫీచర్‌ను తీసుకురావాలని చూస్తోంది. దీనివల్ల ఎలాంటి యాప్‌ సాయం లేకుండానే అవతలి వ్యక్తి ఎవరనేది ఫోన్ డిస్‌ప్లేపై తెలిసిపోతుంది. కాలింగ్ నేమ్‌ ప్రజంటేషన్‌ (CNAP)ను ట్రాయ్‌ ప్రతిపాదిస్తోంది. దీనివల్ల స్పామ్‌ కాల్స్‌కు కూడా చెక్‌ పడనుంది.

అసలేంటీ CNAP? స్పామ్‌ కాల్స్‌కు ఎలా చెక్‌ పెట్టనుంది?
అచ్చం ట్రూకాల్‌ యాప్‌ తరహానే ఈ CNAP పనిచేస్తుంది. అయితే ఎలాంటి యాప్‌తో పని లేకుండా కాల్‌ చేస్తున్న వ్యక్తి ఎవరనేది ఫోన్ డిస్‌ప్లేపై తెలిసిపోతుంది. దీనికోసం టెలికాం కంపెనీల వద్ద ఉండే రిజిస్ట్రేషన్‌ డేటాను వినియోగించాలని ట్రాయ్‌ భావిస్తోంది. అందులోభాగంగానే నెట్‌వర్క్ ప్రొవైడర్లు వారి కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (CAF)లో చందాదారులు అందించిన పేరును పొందుపరచాలని ట్రాయ్‌ సూచించింది. ఎక్కువ సంఖ్యలో సిమ్‌ కార్డులు తీసుకొనేవారు దరఖాస్తు ఫారంలో ‘preferred name’ ని ఎంచుకొనే సదుపాయం ఉందని తెలిపింది. అంటే ఏ పేరు మీద సిమ్‌ కార్డ్‌ని కొనుగోలు చేస్తారో అదే పేరు కాల్‌ చేస్తున్న వ్యక్తి స్క్రీన్‌పై కనిపిస్తుందన్నమాట.

సాధారణంగా గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్‌ వచ్చినప్పుడు ఫోన్‌ ఎత్తితే గానీ అది స్పామ్‌ కాలో, కాదు తెలియడం లేదు. ఒకసారి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే.. కాల్‌ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవడమే కాకుండా స్పామ్ కాల్స్‌కు చెక్‌ పెట్టొచ్చు.

వ్యతిరేకిస్తున్న టెలికాంలు

కాలింగ్ నేమ్‌ ప్రజంటేషన్‌ (CNAP) ప్రతిపాదనను గతేడాదే ట్రాయ్‌ తీసుకొచ్చింది. దీనిపై టెలికాం సంస్థలు జియో (Jio), ఎయిర్‌టెల్‌ (Airtel), వొడాఫోన్‌ ఐడియా (Vi) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ ఫీచర్‌ వల్ల యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతుందని, సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జియో పేర్కొంది.

వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది. యూజర్ల గోప్యతను దృష్టిలో ఉంచుకొని టెలీ మార్కెట్లకు, వాణిజ్య వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ని పరిమితం చేయాలని సూచించింది. వొడాఫోన్‌ సైతం ఈతరహా అభ్యంతరాలను వ్యక్తంచేసింది.

ట్రూకాలర్‌ కంటే భిన్నంగా ఉంటుందా?

ట్రూకాలర్‌ లాంటి సేవలు క్రౌడ్-సోర్స్ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కచ్చితత్వంతో ఉండవు. డేటాబేస్ కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (CAF)లోని సమాచారంపై CNAP ఆధారపడి ఉంటుంది. ఇది ప్రభుత్వం నుంచి పొందిన గుర్తింపుపత్రాలను ఉపయోగించి ధ్రువీకరిస్తుంది. ఇది కచ్చితమైన సమాచారం అందించకపోయినప్పటికీ క్రౌడ్ సోర్స్‌ సేవలతో పోలిస్తే కాస్త మెరుగైనదిగా భావించొచ్చు. ఈ ఫీచర్‌ను ట్రయల్‌ ప్రాతిపదికన పరీక్షించాలని చూస్తున్నట్లు ట్రాయ్‌ పేర్కొంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది.

ఇతరుల ఫోన్‌లో మీ పేరు కనిపించకూడదు అనుకుంటే 2015లో తీసుకొచ్చిన కాలింగ్‌ లైన్‌ ఐడెంటిఫికేషన్ రెస్ట్రిక్షన్‌ (CLIR) సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ట్రాయ్‌ పేర్కొంది. దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ట్రాయ్‌ ప్రతిపాదనలకు అంగీకరిస్తే.. ఒక కటాఫ్‌ తేదీని నిర్ణయించి అప్పటినుంచి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశిస్తుంది

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you