- దేశ వ్యాప్తంగా సమ్మె ను జయప్రదం చేయాలి
- సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్
తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : ఈనెల16వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో అన్ని రంగాల కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజే రమేష్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం పట్టణంలో ఉన్న పెట్రోల్ బంక్ ఆటో షాప్ ఎంప్లాయ్ తదితర కార్మికుల వద్ద సమ్మె విజయవంతం కోసం సోమవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గ్రూపు మీటింగుల్లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల చుట్టాలను నాలుగు కోడ్ ల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాల రద్దు వల్ల కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు లాభాలు సమకూర్చటం కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక సంక్షేమంపై కార్మిక హక్కులపై దాడి చేస్తుందని విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ జరుగుతుందని తెలిపారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులు కర్షకుల హక్కులపైన చేస్తున్న దాడి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగానికి తగిన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నిర్మాణరంగ కార్మికుల్లో సంక్షేమ పథకాల అమలుకు ఏర్పాటు చేయబడిన సంక్షేమ బోర్డులను కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని పేర్కొన్నారు. 1996 కేంద్ర చట్టాన్ని రక్షించుకోవాల్సిన అవసరం నిర్మాణ కార్మికులపై ఉందని గుర్తు చేశారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ బోర్డు ద్వారా మోటార్ సైకిల్ పంపిణీ చేపడతామని వాగ్దానం చేసి అమలు చేయలేదని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మోటారు సైకిళ్ళు పంపిణీ పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బును కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని ఆయన కోరారు. అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు జరిగే సమ్మెలో పాల్గొనాలని అన్నారు. అన్ని రంగాల కార్మికులు పని కేంద్రాలతో పాటు నివాస ప్రాంతాల్లో సైతం కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి వీరన్న, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ వివిధ రకాల రంగాల కార్మికులు పాల్గొన్నారు.