- సింగరేణి ఉమెన్స్ కాలేజీలో అవినీతి అక్రమాలు
- విచారణ జరపాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ డిమాండ్
తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి ఉమెన్స్ జూనియర్ కాలేజీలో ల్యాబ్ అటెండర్ పోస్టులలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఉమెన్స్ జూనియర్ కాలేజీలో గత నెలలో ల్యాబ్ అటెండర్ రెండు పోస్టులను ఎటువంటి పేపర్ నోటిఫికేషన్ లేకుండా నోటీస్ బోర్డ్ ల మీద నోటిఫికేషన్ అంటించి అక్రమ పద్ధతిలో సింగరేణి ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ నికోలస్ ఇంట్లో పనిచేసే పనిమనిషి సొంత చెల్లెలిని అక్రమ పద్ధతుల్లో ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఇంకొక మగ వ్యక్తిని అక్రమ పద్ధతిలో తీసుకున్నారని సింగరేణి ఉమెన్స్ జూనియర్ కాలేజీలో మగ వ్యక్తులు పనిచేయాలంటే 45 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్ని మాత్రమే ఉద్యోగంలోకి తీసుకోవాలని నిబంధన ఉందన్నారు. అది పెర్మనెంట్ అయినా కాంట్రాక్ట్ అయిన అడహాక్ బేస్ అయినా ఎటువంటి పోస్టులు అయినా 45 సంవత్సరాలు దాటిన వారిని మాత్రమే తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొన్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి సింగరేణి ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ నికోలస్ అక్రమ పద్ధతుల్లో ఇద్దరు ల్యాబ్ అసిస్టెంట్లను తీసుకోవడం జరిగిందని వెంటనే నోటిఫికేషన్ రద్దు చేయాలని వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలా అక్రమ పద్ధతులలో రెండు నెలలు మూడు నెలలు అని ఉద్యోగంలోకి తీసుకొని తరువాత వాళ్ళను అక్రమ పద్ధతుల్లో కాంట్రాక్టు చేస్తున్నారని ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం అక్కడ ప్రిన్సిపాల్ సింగరేణి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కుమ్మక్కై నిరుద్యోగుల జీవితాలతో సింగరేణి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
ఇలా అక్రమ పద్ధతుల్లో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న సింగరేణి ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ నికోలస్ ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కోటా శివశంకర్ హెచ్చరించారు.