పార్కు స్థలంలో వెలిసిన వైన్స్ షాపు షెడ్డు..
కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న అధికారులు…
స్ధానిక ప్రజాప్రతినిధులే అక్రమార్కులకు అండా ?
భారీ మొత్తంలో ముడుపులు…
తెలంగాణవీణ, కాప్రా ; కాప్రా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమార్కులు ప్రభుత్వ చెరువులను పార్కులను దర్జాగా కబ్జా చేస్తూ అక్రమాలకు తెగబడుతున్నారు. ఇందుకు నాచారం డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్లు 91, 156,157లలో అక్రమంగా వెలిసిన బారీ మధ్యం షెడ్డు నిర్మాణమే నిలువెత్తు నిదర్శనం. నాచారం మల్లాపూర్ ప్రధాన రహాదారి వైజయంతి టాకీస్ ఎదురుగా సుమారు 400 గజాల పార్కు స్థలం ఉన్నట్లు రెవిన్యూ, ఆనాటి గ్రామపంచాయితీ రికార్డులను బట్టి తెలుస్తోంది. అయితే ఈ పార్కు స్థలం వెనుక భాగంలో ప్లాట్ నెంబర్లు 19,20లలో 866 చ.గజాల చొప్పున ప్రైవేటు స్థలం ఉంది. ఈ ప్లాట్లలోకి వెళ్లేందుకు రహాదారి సౌకర్యం లేకపోవటంతో ప్లాట్ నెంబరు 19 వెనుకభాగంలో ఉన్న 866 గజాల స్థలానికి ఈ పార్కు స్థలం కలిపి వైన్స్ షాపు షెడ్డును రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ షాడో నాయకులు కొందరు అక్రమార్కులతో కుమ్మకై భారీ మొత్తంలో ముడుపులు అందుకుని వీరికి అండగా నిలిచారనే ఆరొపనలు వినిపిస్తున్నాయి. వీరి సారధ్యంలోనే అధికారులను సైతం సక్రమం చేయటంతో లైన్ క్లీయర్ అయిందనీ స్థానికులు ఆరొపిస్తున్నారు. దర్జాగా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నా ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే పార్కు స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్డును కూల్చివేయాలని జెహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసి రోజులు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని ఆరొపిస్తున్నారు. ఇప్పటికైనా న్యాయస్థాన విలువలను కాపాడి అక్రమంగా నిర్మించిన షెడ్డును కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిగో కోర్టు ఆదేశాలు….. పార్కు స్థలంలో వెలిసిన వైన్స్ షాపు షెడ్డు..