తెలంగాణవీణ, హైదరాబాద్ : తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది.